25 ఓవర్సీస్ ప్రింట్లతో 'మగధీర'
రామ్ చరణ్, కాజల్ జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'మగధీర' చిత్రాన్ని ప్రముఖ ఆడియో రికార్డింగ్ సంస్థ సుప్రీం మ్యూజిక్ అధినేత సుప్రీంరాజు ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల 'అస్త్రం' చిత్రంతో నిర్మాతగా మారిన సుప్రీం రాజు ప్రస్తుతం తరుణ్ కథానాయకుడుగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే తరుణంలో 'మగధీర' చిత్రం ద్వారా తొలిసారి ఓవర్ సీస్ పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో శుక్రవారంనాడు జరిగిన కార్యక్రమంలో సుప్రీంరాజు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రముఖ దర్శకనిర్మాత సాగర్, శక్తి ఫిలింస్ కు చెందిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం రాజు మాట్లాడుతూ, ఆడియో రంగంలో పదేహేడేళ్లుగా ఎంతో ఆదరణ చూరగొన్నామనీ, ఫ్యాన్సీ రేటుతో 'మగధీర' చిత్రాన్ని తాము దక్కించుకుని ఓవర్ సీస్ లో తొలిసారి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు. ఓవర్సీస్ లో అత్యధిక స్క్రీన్స్ తో విడుదలవుతున్న తెలుగు సినిమా క్రెడిట్ కూడా 'మగధీర'కు దక్కుతుందన్నారు. 25 ప్రింట్లతో 40 సెంటర్లలో ఈ చిత్రాన్ని తాము రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రం తర్వాత నితిన్-ఇలాయానా 'రెచ్చిపో', నాని-మాధవీలత 'స్నేహితుడా' చిత్రాల ఓవర్ సీస్ రైట్స్ ను కూడా తాము సొంతం చేసుకున్నట్టు చెప్పారు. తెలుగు సినిమా ఓవర్సీస్ పంపిణీలో తొలిసారి అడుగుపెట్టిన సుప్రీం రాజుకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు సాగర్ తదితరులు పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|