'అడవి' పాటకు సెన్సార్ కట్
రామ్ గోపాల్ వర్మ సినిమాలు విడుదల తర్వాత సంచలనాలు సృష్టించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమాలు విడుదలకు ముందే ఏదోరకమైన వివాదాలను ఎదుర్కొంటున్నాయి. 'రణ్' చిత్రంలో 'జన గణ మణ రణ్ హై' పాట సెన్సార్ అభ్యంతరంతో ప్రస్తుతం ఆ వ్యవహారం ట్రిబ్యునల్ ముందుంది. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ఫారెస్ట్ థ్రిల్లర్ 'అజ్ఞాత్' లోని ఓ పాట ట్రాక్ ను రీ-ఎడిట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు వర్మకు సూచించింది. ఈ చిత్రం తెలుగులో 'అడవి' పేరుతో విడుదల కానుంది.
ఈ చిత్రంలో కథానాయిక ప్రియాంక కొఠారి పై 'జై శ్రీ శంభు' అనే పాట ఉంది. ఇందులో ప్రియాంక చిలుము (హుక్కా) తాగే ఓ షాట్ కూడా తీశారు. దీనిపై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటను రీ-ఎడిట్ చేయాల్సిందిగా సూచించింది. బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు గతంలో ఉన్నాయనీ, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని వర్మ వాపోయారట. అయితే 'రణ్' పాట అనుభవం వల్లనో మరో కారణం వల్లనే కానీ వర్మ ఈసారి మాత్రం నిషా పాటను రీ-ఎడిట్ చేయడానికి అంగీకరించి సెన్సార్ సర్టిఫికెట్ తో గట్టెక్కారట. టాలీవుడ్ హీరో నితిన్ ఈ చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్ కు పరిచయమవుతుండటం విశేషం. యూటీవీ మోషన్స్ పిక్చర్స్, డ్రీమ్ ఫోర్స్ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు వెర్షన్ 'అడవి' విశాఖ టాకీస్ సమర్పణలో నట్టికుమార్ సహనిర్మాతగా రూపొందింది. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఈ శనివారమే 'అడవి' ఆడియో విడుదలవుతోంది. ఆగస్టు 7న తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో థియేటర్ల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|