'అడవి' పాటలు విడుదల
నితిన్, ప్రియాంక కొఠారి జంటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన హిందీ 'అగ్యాత్' తెలుగులోనూ 'అడవి' పేరుతో విడుదలవుతోంది. రోనీ స్క్రూవాలా, వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని సినీమాక్స్ మల్టీప్లెక్స్ లో విడుదలైంది. నితిన్, ప్రియాంక కొఠారి, వర్మ, చదలవాడ శ్రీనివాసరావు, చదలవాడ తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నట్టికుమార్, సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హిర్వాని తదితరులు పాల్గొన్నారు. ఆడియా సీడీలను చలనచిత్ర పరిరక్షణ సమితి చైర్మన్ చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి తొలి ప్రతిని వర్మకు అందించారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల క్రితం తాను 'జంగిల్' అనే సినిమా తీసినప్పుడు అడవిలో వెళ్తుంటే తనను ఎవరో నిశితంగా చూసినట్టు అనిపించిందనీ, ఆ అనుభూతే 'అడవి' చిత్రానికి ప్రేరణ అనీ చెప్పారు. హాలీవుడ్ లో అడవి నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చినప్పటకీ వాటికీ భిన్నంగా ఈ సినిమాను సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం అడవిలోకి వెళ్లిన యూనిట్ లో ఒక్కొక్కరూ అదృశ్యమవుతుంటారనీ, వారిని హతమార్చే అదృశ్య శక్తి ఎవరనేది తెరమీద చూడాల్సిందేననీ అన్నారు. ఈ సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్ కీలకమనీ, ఈ చిత్రం కోసం నితిన్ చాలా కష్టపడ్డాడనీ చెప్పారు. తమ బ్యానర్ కు ఇది ఎంతో ప్రిస్టేజియస్ చిత్రమని నట్టికుమార్ తెలిపారు. వర్మకున్న క్రేజ్ ఈ చిత్రాన్ని విజయపథంలోకి నడిపిస్తుందనీ, ఆంధ్రప్రదేశ్ లో 160 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. నితిన్ మాట్లాడుతూ, వర్మ సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందనీ, ఇలాంటి సినిమాలు ఏ దర్శకుడూ తీయలేరనీ అన్నారు. వర్మ చేతుల మీదుగా బాలీవుడ్ కు పరిచయం కావడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈ చిత్రంలో వర్మ తనను ఎంతో అందంగా చూపించారని ప్రియాంక కొఠారి పేర్కొంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చదలవాడ శ్రీనివాసరావు, తిరుపతిరావు ఆకాంక్షించారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
|