లీగల్ గానే ఎదుర్కొంటా: త్రిష
'నా సహనానికి కూడా హద్దు ఉంటుంది. గాసిప్స్ పుట్టించే వారిని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లీగల్ చర్యలతోనే అలాంటి వారికి ముకుతాడు వేస్తా' అంటూ కారాలు మిరియాలు నూరుతోంది నటి త్రిష. క్రికెటర్ బదానీతో ఈమధ్యనే చెన్నైలోని ఓ నైట్ క్లబ్ లో త్రిష తప్పతాగి గొడవపడిందంటూ చెన్నై సర్కిల్స్ లో ప్రచారమైన ఓ వార్త ఇప్పుడు త్రిష ఆగ్రహానికి కారణమవుతోంది.
చెన్నై కథనం ప్రకారం...హేమంగ్ బదాని నైట్ క్లబ్ కు వచ్చినప్పుడే త్రిష తన ఫ్రెండ్ తో అక్కడకు వచ్చింది. త్రిషను చూసి బదాని పలకరించారట. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో మందు తీసుకున్న త్రిష ఆయనను వేలుపెట్టి చూపించి 'అతను ఏమంత క్రికెటర్' అంటూ గేళి చేసింది. దీంతో బదానికి కోపం వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటల యుద్ధం ముదురి పిడిగుద్దుల వరకూ వెళ్లడంతో క్లబ్ నిర్వాహకులు కలుగజేసుకుని ఇద్దరినీ సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదని త్రిష తల్లి వివరణ ఇచ్చారు. త్రిష-బదానీ కొట్లాట వ్యవహారం మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో త్రిష వెంటనే రంగంలోకి దిగింది. 'ఈ వదంతుల్లో ఎంత మాత్రం నిజం లేదు. క్రికెటర్ బదానీని నేను ఎప్పుడూ కలుసుకోలేదు. నైట్ క్లబ్ లో ఫ్రెండ్స్ తో కలిసి మీల్స్ చేశానంతే. తక్కిన వ్యవహారమంతా కట్టు కథే' అంటూ త్రిష చెప్పుకొచ్చింది. వదంతులు పుట్టించే వారు తనను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోందనీ, అయితే వారెవరో తెలుసుకుని లీగల్ చర్యలు తీసుకుంటాననీ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి తన లాయర్లను కూడా సంప్రదిస్తున్నాననీ, ఇక నుంచి ఇలాంటి వ్యక్తులను ఆషామాషీగా వదిలిపెట్టేది లేదనీ ఆమె స్పష్టం చేసింది.
Be first to comment on this News / Article!
|