గోపీచంద్ తో మూడోసారి...
ఇవాల్టి హీరోల్లో గోపీచంద్ ను లక్కీ హీరోగా చెప్పుకోవాలి. యువహీరోల మధ్య గట్టిపోటీ ఉన్నప్పటికీ గోపీచంద్ తన యాక్షన్ ఇమేజ్ తో సినిమా వెంట సినిమా చేసుకుంటూ పోటీలేని హీరో అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో 'శంఖం' చిత్రంలో నటి త్రిషతో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తదుపరి చిత్రం కూడా ఖరారైంది. ఈ ఏడాది ఇంతవరకూ రెండు బిగ్గెస్ట్ హిట్ లు టాలీవుడ్ లో నమోదు కాగా, వాటిలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తీసిన 'కిక్' ఒకటి. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఈ సంస్థ ఓ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ఇందులో గోపీచంద్ కథానాయకుడుగా ఎంపికయ్యారు. హీరోయిన్ గా అనుష్క నటించనుంది. గోపీచంద్, అనుష్క కలిసి నటిస్తుండటం ఇది ముచ్చటగా మూడోసారి.
'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాల్లో గోపీచంద్-అనుష్క కలిసి నటించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ సక్సెస్ ను చవిచూశాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ఈ జంట నటించనున్న మూడో చిత్రంపై అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టే...ఇప్పడు గోపీచంద్ తో సినిమా తీయనున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నుంచే 'లక్ష్యం' చిత్రం తెరకెక్కింది. అందులో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు తెరకెక్కనున్న తాజా చిత్రంలోనూ జగపతిబాబు ఉండబోతున్నారు. అంటే 'లక్ష్యం' టీమ్ అంతా మళ్లీ జతకట్టబోతున్నట్టే. ఈ చిత్రం ద్వారా గోపీ అనే కొత్త యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|