నానితో సూపర్ గుడ్ 'భీమిలి'
క్రీడా నేపథ్యంలో వచ్చిన 'కబడ్డీ కబడ్డీ' చిత్రం అప్పట్లో ప్రేక్షకాదరణ చూరగొంది. ఇప్పుడు అదే ఆట నేపథ్యంలో ప్రేమ, వినోదం మేళవించి మెగాసూపర్ గుడ్ ఫిలింస్ 'భీమిలి' అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టుంది. దీనికి 'కబడ్డి జట్టు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాని ('అష్టాచమ్మ', 'రైడ్' ఫేమ్), శరణ్య మోహన్, కీర్తన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం ప్రారంభమైంది. నానిపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. చిత్ర సమర్పకుడు ఆర్.బి.చౌదరి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ, తమిళంలో ఘన విజయం సాధించిన వెన్నెల (కబడ్డీ కుళు) చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నామనీ, 90 శాతం కొత్తవారితో ఈ సినిమాను చేస్తున్నామనీ చెప్పారు. నటీనటులతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా అందరూ కొత్తవారేననీ, ప్రతిభా పాటవాలు ఉన్నవారనీ తెలిపారు. స్పోర్ట్స్ నేపథ్యంలో లవ్, ఎంటర్ మైన్ మెంట్, ఫ్యామిలీ డ్రామా వంటి అంశాలు మేళవించిన సబ్జెక్ట్ ఇదని దర్శకుడు తాతినేని సత్య తెలిపారు. తన తొలి చిత్రమే మెగా సూపర్ గుడ్ వంటి పెద్ద బ్యానర్ లో చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ, కొత్తదనం, వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారనీ, అదే తరహాలో ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఆగస్టు 3 నుంచి తొలి షెడ్యూల్ ఉంటుందనీ, సెప్టెంబర్ లో మరో షెడ్యూల్ చేసి, అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేస్తామన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని సంగీత దర్శకుడు సెల్వగణేష్ తెలిపారు. ఇందులో ఐదు పాటలుంటాయని చెప్పారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మాట్లాడుకోకుండా ఎలా ప్రేమించుకున్నారన్నదే ఈ చిత్రమనీ, ఇందులో మంచి పాటలు రాసే అవకాశం తనకు కలిగిందనీ గీత రచయిత వనమాలి తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఇంత మంచి బ్యానర్ లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని నాని తెలిపారు. ఈ సమావేశంలో మరో నిర్మాత పరాస్ జైన్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కిషోర్, ధనరాజ్, వినయ్, కౌటిల్య, సంతోష్, రమేష్, శివ, విక్కీ, ఉపేంద్ర, రాఖి, వై.ఎస్.కృష్ణేశ్వరరావు, కోటేష్ తదితరులు నటిస్తున్నారు. సుశీ కథ, అల్లు దిలీప్ కుమార్ మాటలు, వనమాలి-అభినయ శ్రీనివాస్ పాటలు, చిట్టిబాబు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|