'అడవి'లో ఆరు క్లైమాక్స్ లు
రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసినా అందులో ప్రత్యేకత ఉండాల్సిందే. 'షోలో' చిత్రాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరూ సాహసించని తరుణంలో 'రామ్ గోపాల్ వర్మ్ కీ ఆగ్' అంటూ 'షోలో' రీమేక్ చేసి చూపించారు. ఆ చిత్రం ఫెయిల్ కావడం వేరే సంగతి. అరవై ఏళ్ల వృద్ధుడికీ, పదహేరేళ్ల అమ్మాయికీ మధ్య లవ్ సృష్టించి 'నిశ్శబ్ద్' అన్నారు. ఒంటిరిగా థియేటర్లో చూసే వాళ్లకు ఇదో సవాల్ అంటూ 'ఫూంక్' చిత్రాన్ని జనాల ముందుకు తెచ్చారు. ఒకటో అరో మినహాయిస్తే ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయన ఫారెస్ట్ థ్రిల్లర్ గా తీసిన 'అజ్ఞాత్' చిత్రం తెలుగులో 'అడవి' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది హాలీవుడ్ స్థాయిలో ఉంటుందనీ, ఈ తరహా చిత్రాలు హాలీవుడ్ లో వచ్చినా ఇందుకు భిన్నంగా తన చిత్రం ఉంటుందని వర్మ ధీమాగా చెబుతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఓ తమాషా ట్విస్ట్ కూడా చేశారు. స్వయంగా ఆ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. ఇంతకూ ఆ విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఏమిటనేది అందులో నటించిన వాళ్లకు కూడా తెలియదట. వినడానికి విచిత్రంగా లేదూ. అదే కదా వర్మ స్టయిల్.
ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లిన యూనిట్ సభ్యులను ఓ అజ్ఞాత శక్తి ఒక్కొక్కరిగా హతం చేస్తుంటుంది. చివరికి ఆరుగురు మిగులుతారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది క్లైమాక్స్ లో చూపిస్తారు. అయితే వర్మ ఈ అరుగురి మీద వేర్వేరుగా ఆరు క్లైమాక్స్ లు రెడీ చేశారు. ఇందులో ఏ క్లైమాక్స్ ను ఫైనలేజ్ చేస్తారనేది మాత్రం ఆయన కొక్కరికే తెలుసు. భలే గమ్మత్తుగా ఉంది కదూ. వర్మనా మజాకానా?!
Read 1 Comment(s) posted so far on this News / Article!
|