ఆగస్టులో 'అ ఆ ఇ ఈ'
హాస్య ప్రధానంగా తాను తీసిన పలు హిట్ చిత్రాల కంటే మిన్నగా 'ఆ ఆ ఇ ఈ' (అతను ఆమె ఇంతలో ఈమె) చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా శ్రీ కల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం ఆశోక్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ మంగళవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సెంటిమెంట్ తో కూడిన చక్కటి కుటుంబ కథాచిత్రమిదనీ, ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను మలిచామనీ చెప్పారు. అనివార్య కారణాలవల్ల చిత్ర ఆలస్యమైందనీ, మరో మూడు రోజుల్లో తొలి కాపీ వస్తుందనీ, ఆగస్టు ప్రథమార్థంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి శ్రీలేఖ అద్భుతమైన సంగీతం ఇచ్చిందనీ, అలాగే రెండు పాటలు దుబాయ్, మరో రెండు రామోజీ ఫిల్స్ సిటీలో, ఇంకో పాట హంపీలో చిత్రీకరించామని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందరి సహకారంతో సినిమా బాగా తీయగలిగినట్టు నిర్మాత అశోక్ యాదవ్ తెలిపారు. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ చిత్రానికి సంగీతం అందించినట్టు శ్రీలేఖ తెలిపారు. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని తీశామనీ, ఇంటిల్లిపాదీ చూసేలా సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, ఆలీ, గిరిబాబు, రఘుబాబు, సునీల్, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, కవిత, కౌష, రమ్యశ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి భాస్కరభట్ల పాటలు, విజయ్ సి సుమార్ ఛాయాగ్రహణం, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు.

Be first to comment on this News / Article!
|