జనంలోకి వస్తున్న 'లీడర్'
లీడర్ అంటే జనాల్లోనే ఉంటాడు కదా. మరి వెండితెర 'లీడర్' ఎప్పుడు జనాల మధ్యకు వస్తాడంటారా? అందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రస్తావన అంతా దగ్గుపాటి యవకిషోరం రానా (రామానాయుడు) చిత్రం గురించే. డి.రామానాయుడు మనువడు, డి.సురేష్ బాబు తనయుడైన రానా 'లీడర్' చిత్రం ద్వారా తొలిసారి హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ ఇంతవరకూ గుట్టుగానే ఉంచుతున్నప్పటికీ షూటింగ్ కొద్దికాలంగా శరవేగంగానే నిర్మాణం జరుపుకొంటోంది. 'హ్యాపీడేస్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవియం నిర్మిస్తోంది.
రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండగా, సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదిగే పాత్రలో రానా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సన్నివేశాల డిమాండ్ మేరకు రానా లీడర్ గా జనం మధ్యకు వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి శేఖర్ కమ్ముల ప్రస్తుతం ప్లానింగ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్, విజయవాడ, కారంచేడు, వైజాగ్, రాజమండ్రిలలో జనం మధ్య ఈ సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతోంది. ఆగస్టు 1 నుంచి ఆయా ఏరియాల్లో షూటింగ్ జరగబోతోంది. సెప్టెంబర్ నెలాఖరులో గానీ, అక్టోబర్ ప్రథమార్థంలో గానీ 'లీడర్' థియేటర్ల ముందుకు రావచ్చు.
Be first to comment on this News / Article!
|