ప్లాటినమ్ హీరోయిన్
'ఇష్టం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రియ ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ పలు ప్రిస్టేజియస్ చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఈమధ్యనే 'ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్' చిత్రంతోనూ హాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం విక్రమ్ సరసన నటించిన ద్విభాషా చిత్రం 'మల్లన్న' (తమిళ కందసామి) విడుదలకు సిద్ధమవుతోంది. శ్రియకు ఇటీవల యువహీరోయిన్ల పోటీ ఎక్కువైందనీ, ముఖ్యంగా తమిళంలో నయనతార, తమన్నా వంటి హీరోయిన్లే ఆమెకు ప్రధాన ప్రత్యర్థులనీ ఇటీవల వస్తున్న వార్తలను శ్రియ తన తాజా ఇంటర్వ్యూలో నిర్ద్వంద్వంగా ఖండించింది.
దక్షిణాది నుంచి పలువురు హీరోయిన్లు ఉత్తరాదికి (బాలీవుడ్ కు) వెళ్తున్న మాట నిజమే అయినప్పటికీ తాను ఇప్పటికే బాలీవుడ్ లోనూ, అంతకుమించి హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాననీ, సూటిగా చెప్పాలంటే దక్షిణాది నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ఏకైక నటి తానేననీ శ్రియ చెప్పుకొచ్చింది. 'నయన, తమన్నా బంగారమైతే, నేను ప్లాటినం' అంటూ ఆ ఇద్దరూ తనకు ఎంతమాత్రం పోటీకాదనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పింది. ప్రస్తుతం 'చిక్కు బుక్కు', 'కుట్టీ' చిత్రాల్లో నటిస్తున్నాననీ, మరి కొన్ని ప్రాజెక్టులు కూడా స్క్రిప్టు పరిశీలన దశలో ఉన్నాయని తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాల నుంచి పలు ఆఫర్లు వస్తున్నా బిజీ కారణంగానే నటించలేకపోతున్నానని తేల్చిచెప్పింది.
Be first to comment on this News / Article!
|