బాలయ్యతో మళ్లీ ప్రియమణి
నందమూరి ఫ్యామిలీ హీరోలందరితోనూ జతకట్టిన ప్రియమణి మరోసారి యువరత్న బాలకృష్ణతో నటించేందుకు సిద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో 'యమదొంగ', కల్యాణ్ రామ్ తో 'హరే రామ్' చిత్రాల్లో నటించిన ప్రియమణి ఈమధ్యనే 'మిత్రుడు'లో బాలకృష్ణకు జోడిగా నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ ను అంతగా ఆకట్టుకోకపోయినా బాలకృష్ణ-ప్రియమణి జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అభినయం పరంగా కూడా ప్రియమణి మంచి స్కోరింగ్ చేసింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తదుపరి చిత్రమైన 'భీష్మ'లో హీరోయిన్ గా ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం.
బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' వంటి చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ కథానాయకుడుగా మాస్ ఎంటర్ టైనర్ గా 'భీష్మ' చిత్రాన్ని నిర్మంచబోతున్నారు. ఇటీవల ఆయన తీసిన 'రైడ్' చిత్రాన్ని విజయపథంలోకి నడిపిన దర్శకుడు రమేష్ వర్మ ఈ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. పార్వతి మిల్టన్, నయనతార, భూమిక వంటి పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు రేసులో ప్రియమణి వచ్చి చేరినట్టు సమాచారం. ప్రియమణి ప్రస్తుతం జగపతిబాబు సరసన 'ప్రవరాఖ్యుడు' చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం 'రావణ్'తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టనుంది. బాలకృష్ణతో మరోసారి జోడి కడుతున్న 'భీష్మ' చిత్రం ఈనెల 31న పరిశ్రమ ప్రముఖుల మధ్య ఆర్భాటంగా ప్రారంభం కాబోతోంది. ఇదే తరుణంలో చిత్రంలోని హీరోయిన్లను, రిలీజ్ తేదీని కూడా బెల్లంకొండ సురేష్ అనౌన్స్ చేయనున్నారు.
Be first to comment on this News / Article!
|