నయనతారే ఎందుకు?!
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు తెలుగు పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్లంతా దాదాపు పక్క రాష్ట్రాల నుంచి, ఇతర భాషా చిత్రాల నుంచి వచ్చినవారే. తెలుగమ్మాయిలకు తెగువ ఉండదనే ఏకైక కారణం చూపుతున్న ఫిల్మ్ మేకర్స్ పరభాషా తారలకు పెద్దపీట వేసి అక్కడ ఓ మోస్తరు అనిపించుకున్న వాళ్లకు కూడా భారీ పారితోషికాలు, స్టార్ హోటల్స్ మర్యాదాలతో నెత్తినెక్కించుకుంటున్నారనే అపప్రద ఉండనే ఉంది. తన కో-స్టార్స్ తో ప్రేమాయణాల్లో దిట్ట అనిపించుకుంటున్న నయనతార ఇప్పుడు మరో రకంగానూ అందరి నోళ్లలోనూ నానుతోంది. 'కిక్' చిత్రంతో విజయపథంలో ఉన్న రవితేజ తాజాగా 'ఆంజనేయులు' చిత్రం కోసం నయనతారతో జోడి కట్టారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవలే అర్భాటంగా జరిగినప్పటికీ నయనతార ఆ వేడుకకు గైర్వాజరు కావడమే ప్రధాన చర్చనీయాంశమైంది.
ఏ సినిమా ఫంక్షన్ కు అయినా అందులోని హీరోయిన్లు 'సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్' అవుతారనడంలో సందేహం లేదు. పారితోషికం విషయంలో కోటి రూపాయల వరకూ నయనతారను తీసుకువెళ్లిన క్రెడిట్ తెలుగు నిర్మాతలదే. అయితే ఇచ్చిన డబ్బులకు లెక్కగా కాల్షీట్లు ఇచ్చి నటించుకుపోవడం మినహా...సినిమా ప్రమోలు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ టూర్ లకు ఏమాత్రం కుదరదని నయనతార తెగేసి చెప్పేస్తుందట. నిర్మాతలు ఏటిఎం (ఎనీ టైమ్ మనీ)గా పనికొస్తారనే కానీ, సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత బాగోగాలు పట్టించుకోని హీరోయిన్ల వ్యవహారాన్ని పలువురు తప్పుపడుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ లలో ఇప్పటికే తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు హీరోయిన్లు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారనీ, దక్షిణాదిలో ఓ మోస్తరు పేరు వస్తే సమయాన్ని డబ్బుతో ముడిపెట్టి
ప్రమోషన్ వర్క్ కు హీరోయిన్లు పంగనామాలు పెడతారనీ, ఇదో ఘరానా సాగుబడి వ్యవహారమనీ పలువురు తూర్పారబడుతున్నారు. ఫిల్మ్ మేకర్స్ వెంపర్లాట తగ్గనంత వరకూ సదరు హీరోయిన్ల బెట్టుసరి కూడా తగ్గదు. కిం కర్తవ్యం?!
Be first to comment on this News / Article!
|