మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కెరీర్ పరంగా ద్వితీయ విఘ్నుం లేకుండా చూడాలని కోరుతూ కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. 'చిరుత' చిత్రం విడుదలైన 664 రోజుల తర్వాత ఆయన ద్వితీయ చిత్రం 'మగధీర' ఈనెల 31న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన కడప దర్గాను సందర్శించి ప్రార్థనలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దర్గాను తరచు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ సందర్శిస్తుంటారు. ఏడాది క్రితం అభిషేక్-ఐశ్వర్య రాయ్ కలిసి వచ్చి ఇదే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
చరణ్ దర్గాలో ప్రార్థనల అనంతరం విజయదుర్గ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిపారు. పూజల అనంతరం చరణ్ తన అభిమానులకు అభివాదం చేసి వారిని సంబరంలో ముంచెత్తారు. 'మగధీర' విడుదలవుతున్న తరుణంలో పీర్ దర్గాను సందర్శించాల్సిందిగా తన తండ్రి సూచించినట్టు చరణ్ తెలిపారు. 'మగధీర'లోని ఓ పాటలో తన తండ్రితో కలిసి నటించడం ఎనలేని ఆనందాన్ని కలిగిచిందనీ, రాబోయే రోజుల్లో కెరీర్ మరింత ఉజ్వలంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు జరిపాననీ చెప్పారు.