చిరుతకు ఈ చిక్కులేంటి?
చిరంజీవి తనయుడు అని గుర్తుకు వచ్చేలా చరణ్ తొలిచిత్రానికి 'చిరుత' అనే పేరుపెడితే...యాదృచ్ఛికమే అయినా చిరంజీవి 'మగధీరుడు' చిత్రానికి దగ్గరగా చరణ్ ఇప్పుడు 'మగధీర'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తండ్రి వదిలిన రాజ్యానికి తనయుడు స్వశక్తితో ఏలేందుకు సర్వశక్తులూ ఒడ్డినట్టు తొలి-మలి చిత్రానికి చరణ్ తీసుకున్న గ్యాప్ ను బట్టే చెప్పొచ్చు. ఇంత కష్టపడినా 'మగధీర' సాఫీగా రిలీజ్ కాకుండా పలు అవరోధాలు ఎదుర్కోవడం పట్ల చిరంజీవి తన సన్నిహిత వర్గాల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
'మగధీర' చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ లభించినప్పటికీ ఆ ప్రాసస్ లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందనీ, కొన్ని సన్నివేశాలు, సంభాషణల పట్ల సెన్సార్ అభ్యంతారాలు చెప్పిందనీ చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. నిజానికి సంఖ్యాపరంగా కూడా ఆయన ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే ఇందుకు కూడా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన బాధ పడినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిని కూడా కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారని పిఆర్పీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో చరణ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ఆ భగవంతుని ఆశీస్సులు కూడా చరణ్ కు అనివార్యమని భావించిన చిరంజీవి అతన్ని కడప దర్గా, ఇతర ప్రార్థనా మందిరాలను సందర్శించమని కోరడం, చరణ్ తూచా తప్పకుండా పాటించడం చేశారు. 'మగధీర' తన కెరీర్ ను మలుపుతిప్పే బ్లాక్ బస్టర్ అవుతుందని చరణ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
Be first to comment on this News / Article!
|