మరణం దాటే...'మ్యాన్'
నడివయసులో మళ్లీ యవ్వనం తిరిగొస్తే ఏం జరుగుతుంది? అనే పాయింట్ తో డివైన్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై 'మ్యాన్' అనే కొత్తచిత్రం ప్రారంభమైంది. 'మరణం దాటే వంతెనలు ఉన్నాయా?' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. పాత, కొత్త తారలు ఇందులో నటిస్తున్నారు. డాక్టర్ శివకోటి నాగేశ్వరరావు సమర్పణలో ఇ.ప్రకాష్, క్రిష్ణయ్య, పి.మహేష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్లీ పి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బంజారాహిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి కె.పార్ధసారథి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవుని పటాలపై తీసిన ముహూర్తం సన్నివేశానికి సీనియర్ నటుడు 'అంకుశం' రామిరెడ్డి క్లాప్ ఇవ్వగా, రిలయన్ ఫ్రెష్ కార్యనిర్వాహక అధికారి జయప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రిటైర్డ్ సబ్ కలెక్టర్ ఆరోగ్యం గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు రెగ్లీ మాట్లాడుతూ, జీవితంలో విఫలమైన ఓ వ్యక్తికి నడివయసులో యవ్వన కాలం తిరిగొస్తే అతను ఏమి చేస్తాడనేది ఈ చిత్రకథాంశమని చెప్పారు. ప్రతి వ్యక్తి యవ్వన దశలోనే తన ఉజ్వల భవిష్యత్తును ప్రణాళికాబద్ధంగా మలుచుకోవాలనే పాయింట్ అంతర్లీనంగా ఈ చిత్రంలో చూపిస్తున్నామని తెలిపారు. లవ్, హారర్, ఎంటర్ టైనర్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందన్నారు. చిత్ర సమర్పకుడు డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను ఓ పాత్ర పోషిస్తున్నాని తెలిపారు. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాతలు తెలిపారు. సంగీతానికి ఈ చిత్రంలో మంచి ప్రాధాన్యం ఉందని సంగీత దర్శకుడు జాన్సన్ చెప్పారు. విజన్ స్టూడియో అధినేత వల్లభనేని వెంకటేశ్వరరావు, నేని వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో రామిరెడ్డి, శ్రీ (సినీ దర్శకుడు), ఆర్.కె.చౌహాన్, గిరీష్ లంకా తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రెగ్లీ పి సమకూరుస్తున్న ఈ చిత్రానికి బాబి పి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|