ఉషాకిరణం జగపతిబాబు
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఉషాకిరణ్ మూవీస్ గతంలో 'మయూరి', 'చిత్రం', 'నువ్వే కావాలి' వంటి పలు బ్లాక్ బస్టర్లు అందించింది. ఆమధ్య కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ ఇటీవలే ఆ బ్యానర్ నుంచి వచ్చిన 'నచ్చావులే' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంది. దీంతో ఆ సంస్థ వరుస చిత్రాలకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే జగపతిబాబు కథానాయకుడుగా ఓ కొత్త చిత్రానికి ఉషా కిరణ్ మూవీస్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ బ్యానర్ లో జగపతిబాబు నటించనుండటం ఇది రెండోసారి.
జగపతిబాబు దాదాపు తొమ్మిదేళ్ల క్రింత ఇదే బ్యానర్ పై 'మూడు ముక్కలాట' అనే చిత్రంలో నటించారు. రామోజీరావు నిర్మాతగా కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా జగపతిబాబుతో ఉషాకిరణ్ రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటిస్తారు. జగపతిబాబు ప్రస్తుతం మదన్ దర్శకత్వంలో 'ప్రవరాఖ్యుడు' చిత్రంలో నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|