నాగ్ బర్త్ డేకి 'జోష్'
ఎ.ఎన్.ఆర్, నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం ప్రతినిధిగా నాగార్జున తనయుడు నాగచైతన్య ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారా ఎని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నాగచైతన్య తొలిచిత్రమైన 'జోష్' ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇదేరోజు అక్కినేని నాగార్జున బర్త్ డే కూడా కావడంతో అభిమానులకు డబుల్ 'జోష్' ఖాయమనే చెప్పాలి.
తొలుత నాగార్జున బర్త్ డేకి ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసినప్పటికీ 'మగధీర', ఆగస్టు 15న విడుదలకానున్న 'మల్లన్న' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని నెలాఖరున విడుదల చేస్తే గ్రాండ్ కలెక్షన్లు, మంచి రిజల్ట్ వస్తుందని భావించినట్టు సమాచారం. దిల్ రాజు ప్లానింగ్ కు నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డాడీకి బర్త్ డే గిఫ్ట్ గా 'జోష్' ఇవ్వాలని నాగచైతన్య సైతం పట్టుదలగా ఉన్నారు. దిల్ రాజు తీసిన పలు చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన వాసువర్మ ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఆడియో ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై శ్రోతలను అలరిస్తోంది. నాగచైతన్య సరసన సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా కనపిస్తారనీ, వెంకటేష్ తనయుడు మాస్టర్ అర్జున్ చిన్ననాటి నాగచైతన్యగా తెరంగేట్రం చేయనున్నారనీ, నాగార్జున-రాధ జంట కూడా కనిపించబోతున్నారనీ తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, సునీల్, సితార తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చంద్రబోస్-సిరివెన్నెల సాహిత్యం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|