సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏడాదికి పైగా శ్రమించి తీసిన 'మగధీర' చిత్రంతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం ఏమిటనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ వారసుడైన రామ్ చరణ్ రెండో చిత్రాన్ని డైరెక్ట్ చేయడం ద్వారా తనకున్న గట్స్ ను చాటుకున్న రాజమౌళి మరోసారి ఇంకో స్టార్ హీరో వారసుడి చిత్రానికి పనిచేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా ఆ యువహీరోకి కూడా ఇది రెండో చిత్రం కాబోతోంది. 'జోష్' చిత్రం ద్వారా తొలిసారి హీరోగా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య మలి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. కొత్త హీరో రెండో చిత్రానికి రాజమౌళి పనిచేస్తే ఆ సినిమా హిట్టేనన్న సెంటిమెంట్ పరిశ్రమలో ఉంది.
ఎన్టీఆర్ కు రెండో చిత్రమైన 'స్టూడెంట్ నెంబర్ 1' అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చింది. 'చిరుత' తర్వాత రామ్ చరణ్ రెండో చిత్రమైన 'మగధీర' కూడా రాజమౌళి కాంబినేషన్ లోనే వచ్చింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య కెరీర్ ను సైతం నాగార్జున పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను నాగార్జున తన సొంత బ్యానర్ లాంటి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మాత శివప్రసాద్ రెడ్డికి అప్పగించారు. శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం నాగార్జునతోనే ఓ కొత్త చిత్రాన్ని ('కింగ్' తర్వాత) ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. 'మగధీర'రీలీజ్ కావడం, నాగచైతన్య 'జోష్' విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రం సాధ్యమైనంత త్వరలో ప్రారంభమయ్యోందుకు అవకాశాలున్నాయి.