జీవన్ 'ధీర'
ఒక్కోసారి ఒక్కో సీజన్. ఇప్పుడంతా ధీరుల సీజన్. రామ్ చరణ్ తేజ 'మగధీర'గా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే నెలలో హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తనయుడు జైసి చాన్ నటించిన 'ఎంఐ4 ఇన్విజబుల్ టార్గెట్' చిత్రం 'రణధీర' పేరుతో అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తమిళ హీరో జీవన్ సైతం 'ధీర' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. జీవన్, కామ్న జెఠ్మలాని, మాళిక ప్రధాన పాత్రలు పోషించిన ఓ తమిళ చిత్రాన్ని 'ధీర' పేరుతో విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు ఆర్.ఉదయ్ కాంత్, సి.ఎస్.రావు తెలిపారు.
తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందనీ, ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే గట్టి నమ్మకం ఉందనీ నిర్మాతలు తెలిపారు. అన్ని వాణిజ్య పరమైన అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, కామ్న, మాళివిక అందచందాలు, యువన్ శంకర్ రాజా సంగీతం ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఈనెల రెండో వారంలో ఆడియో, మూడో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రానికి వనమాలి-భాస్కరభట్ల-డాడీ శ్రీనివాస్ సాహిత్యం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|