దర్శకుడుగానే గాకుండా నిర్మాతగా కూడా వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆదిత్య రామ్ తో కలిసి వైష్ణవీ ఆర్ట్స్ సమర్పణలో వరుస చిత్రాల నిర్మాణం సాగిస్తున్నారు. మరోవైపు సొంత బ్యానర్ లో దర్శకుడిగా కాక నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. తాజాగా పూరీ జగన్నాథ్ ఆడియో మార్కెట్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. 'పూరీ సంగీత్' అనే ఆడియో కంపెనీని త్వరలో ఆయన ప్రారంభించనున్నారు.ఈ కంపెనీ నుంచి తొలిసారి 'బంపన్ ఆఫర్' చిత్రం ఆడియోను మార్కెట్లోకి తీసుకురానున్నారు.
పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ కథానాయకుడుగా, బిందుమాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) కథానాయికగా 'బంపర్ ఆఫర్' చిత్రం తెరకెక్కుతోంది. పూరీ జగన్నాథ్ శిష్యుడైన రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన సొంత బ్యానర్ చిత్రంతోనే వీడియో రంగంలోకి అడుగుపెడుతున్న పూరీ మరిన్ని చిన్నా పెద్దా చిత్రాలను కూడా తన ఆడియో కంపెనీ ద్వారా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఆడియో రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూరీ ఈ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఏక్ నిరంజన్' చిత్రం తెరకెక్కుతోంది.