మణి ఆఫర్ కు నయన నో
ఇండియాలోని టాప్-10 దర్శకులలో మణిరత్నం ఒకరు. 'రోజా, 'ముంబై', 'అంజలి', 'దళపతి' వంటి ఎన్నో చిత్రాలు ఆయన ప్రతిభను చాటాయి. మణిరత్నం సినిమాలో అవకాశం వస్తే పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఎగిరిగంతేసి ఆ ఆఫర్ ఒప్పుకునేందుకు నటీనటులు వెనుకాడరు. ఇందుకు భిన్నంగా మణిరత్నం తన తాజా చిత్రం కోసం ఇచ్చిన ఆఫర్ ను అందాలనటి నయనతార సున్నితంగా తోసిపుచ్చినట్టు కోలీవుడ్ వర్గాల తాజా భోగట్టా.
మణిరత్నం ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా 'రావణ్' చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, ప్రియమణి, గోవిందా, విక్రమ్ వంటి పాపులర్ స్టార్స్ ఈ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం మరికొన్ని క్యారెక్టర్ల ఎంపిక కూడా అడపాదడపా జరుగుతోంది. తాజాగా మండోదరి పాత్ర కోసం దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం 'ఆధావన్' చిత్రం షూటింగ్ లో ఉన్న నయనతారను సుహాసిని మణిరత్నం సంప్రదించారట. అయితే తాను ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాలకు కమిట్ అయినందున డేట్ల సమస్య ఉందంటూ ఆ ఆఫర్ ను నయనతార తిరస్కరించిందట. నిజానికి మండోదరి పాత్రలో గ్లామర్ కోణం ఉన్నా అది పరిమితమైన నిడివి గల పాత్ర అనీ, ఐశ్వర్య, ప్రియమణి వంటి తారల గ్లామర్ అట్రాక్షన్ ఉన్న చిత్రంలో తాను నటించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనీ నయనతార అభిప్రాయంగా విశ్వసనీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్లామర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని కోరకుంటున్నందు వల్లనే మణిరత్నం ఆఫర్ ను ఆమె తోసిపుచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో ఎన్టీఆర్ 'అదుర్స్', రవితేజ 'ఆంజనేయులు' చిత్రాల్లో నయనతార నటిస్తోంది.
Be first to comment on this News / Article!
|