ఎన్టీఆర్ పై మరో రీమిక్స్!
నిన్నటి వరకూ ఏడాదికి ఒక చిత్రానికే పరిమితమవుతూ వస్తున్న యంగ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఏకకాలంలో రెండు మూడు సినిమాలకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ సైతం ఇప్పుడు స్పీడ్ పెంచారు. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వంశీ పైడిపల్లి నిర్మాతగా కొడాలి నాని సమర్పణలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రం షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. తాజా షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రం అక్టోబర్ లో ప్రారంభమవుతుంది. దీని తర్వాత గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ మరో చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా పైడిపల్లి వంశీ ('మున్నా' ఫేమ్) దర్శకత్వంలో 'బృందావనం' చిత్రానికి ఎన్టీఆర్ ఇప్పటికే డేట్స్ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్ నటిస్తుండటం ఇదే ప్రథమం. ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. టైటిల్ నూ ట్యాగ్ లైన్ నూ మిక్స్ చేస్తూ 'బృందావన మది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే ' అనే పాత పాటను సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నట్టు సమాచారం. విజయా వారి 'మిస్సమ్మ' చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ అభినయం చేసిన పాపులర్ సాంగ్ ఇది. గతంలోనూ 'అల్లరి రాముడు', 'యమదొంగ' చిత్రాలకు సీనియర్ ఎన్టీఆర్ పాపులర్ సాంగ్స్ ను జూనియర్ ఎన్టీఆర్ పై రీమిక్స్ చేశారు. 'బృందావనం' చిత్రం కోసం ఇప్పటికే 5 పాటలు ఫైనలైజ్ అయ్యాయనీ, ప్రస్తుతం వీటి రికార్డింగ్ జరుగుతోందనీ తెలుస్తోంది. 2010 ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|