'ప్రేమిస్తే' శంకర్ కోర్టుకి...
సినిమా రిలీజై నాలుగేళ్లు అయింది. అప్పట్లో ఆ చిత్రం మంచి సక్సెస్ కూడా సాధించింది. అనుకోని విధంగా ఇప్పుడు ఆ దర్శకనిర్మాతలు వివాదంలో చిక్కుకున్నారు. 2005లో తమిళంలో 'కాదల్'గా, తెలుగులో 'ప్రేమిస్తే' పేరుతో శక్తి వేల్ దర్శకత్వం వహించిన చిత్రం రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తన శిష్యుడైన శక్తివేల్ ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. భరత్, సంధ్య కథానాయికలుగా నటించారు. నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే దర్శకనిర్మాతలను ఇప్పుడు కోర్టు ముందు ఉంచబోతోంది.
చెన్నైలోని సెయింట్ జోసఫ్ స్కూలు నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. ఇక్కడే దర్శకుడు ఎక్కువ భాగం షూటింగ్ జరిపారు. వాస్తవ సంఘటన ఆధారంగా సినిమా తీసినట్టు దర్శకనిర్మాతలు ఇచ్చిన పబ్లిసిటీ వల్ల సినిమాలోని సంఘటన యదార్థంగా తమ స్కూలులోనే జరిగి ఉండవచ్చని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారనీ, ఇది తమ స్కూలు ప్రశాంతతకు, రెప్యుటేషన్ కూ తీవ్ర విఘాతం కలిగిస్తోందని పేర్కొంటూ శంకర్, శక్తివేలుపై ఆ స్కూలు డైరెక్టర్ జయరాణి కోర్టులో పిటిషన్ వేశారు. తమను ఆందోళనకు గురిచేసినందుకు 20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. స్కూలు అథారిటీస్ నుంచి సరైన అనుమతి తీసుకోకుండా అక్కడ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని కూడా యాజమాన్యం ఆ పిటిషన్ లో ఆరోపించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి కోర్టు వాయిదా వేస్తూ, అదే రోజు శంకర్, బాలాజీ శక్తివేల్ కోర్టు ముందు హాజరై తమ వాదనను వినిపించాలని ఆదేశించింది.
Be first to comment on this News / Article!
|