ముంబైలో వర్మ టెర్రర్...
'హోమ్లీగా ఉండే ఆడవాళ్లంటే సుతరాము ఇష్టపడను. సెక్సీగా ఉండే ఆడవాళ్లన్నా, నిద్రిస్తుంటే వాళ్లను కన్నార్పకుండా చూడాలన్నా నాకెంతో ఇష్టం. అలాంటి సెక్సీ గాళ్స్ అందాలను మరింత బహిర్గతం చేసే విధంగా షూట్ చేయడమంటే చెవి కోసుకుంటాను' అని చెప్పగల తెగింపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే సొంతం. తన సినిమాల పబ్లిసిటీ కోసం ఎంతకైనా బరితెగించడానికి కూడా ఆయన వెనుకాడరు. ఇందుకోసం ఆయన పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఈమధ్యనే 'ఫూంక్' చిత్రాన్ని ఒంటరిగా థియేటర్లో చూసి..బతికి బట్టకట్టే సాహసికి 5 లక్షలు ఇస్తానని పబ్లిసిటీ స్టంట్ చేశారు. ఇంత చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పల్టీలు కొట్టింది. తాజాగా ఆయన నితిన్, నిషా కొఠారి జంటగా హిందీలో 'అగ్యాత్' (తెలుగులో 'అడవి') అనే ఫారెస్ట్ థ్రిల్లర్ ను ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం ఆయన ఎంచుకున్న పబ్లిసిటీ వ్యూహం ముంబై వాసుల్లో భయోత్పాతం సృష్టించిందట.
'అగ్యాత్' మార్కెట్ జిమ్మిక్ లో భాగంగా ఆదివారం రాత్రి సబర్బన్ ముంబైలోని కీలక ప్రాంతాల్లో 12 హోర్డింగ్ లు వెలిశాయ. సోమవారం ఉదయం ఆ హోర్డింగ్ లు చూసిన జనం బెంబేలెత్తిపోయారు. హోర్డింగ్ ల పైన తాళ్లతో ఉరేసుకున్న మనిషి శవాలు కనిపించడమే ఇందుకు కారణం. నిజానికి ఇవి డమ్మీ బొమ్మలే. అయితే అచ్చంగా మనిషి ఉరేసుకున్నట్టు కనిపించేలా వీటిని అమర్చారు. వీటిలో ఒక హోర్డింగ్ గురెగావ్ ఫ్లైఓవర్ సమీపంలో ఉంచడంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఆత్మహత్య చేసుకున్న యువకుడెవరా అంటూ ఎంక్వైరీలు చేస్తూ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్లు చేశారు. తక్కిన ప్రాంతాల నుంచి కూడా ఇదే తరహా కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు అన్ని హోర్డింగ్ ల నుంచి డమ్మీలు తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పిల్లికి (వర్మ) చెలగాటం ఎలక్కి (జనాలకు) ప్రాణ సంకటం అంటే ఇదే మరి...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|