రామనారాయణ 'దుర్గ'
'శ్రావణమాసం', 'నాగదేవత', 'నాగబాల' వంటి భక్తిరస ప్రధాన చిత్రాలను అందించిన దర్శకుడుగా రామనారాయణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో విడుదలవుతుంటాయి. ఇంతవరకూ 8 భాషల్లో సినిమాలు తీసిన క్రెడిట్ కూడా ఆయనకుంది. ఆయన దర్శకత్వం వహిస్తున్న 119వ చిత్రం 'దుర్గ'. స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. శ్రీ తేనాండల్ ఫిలింస్ పతాకంపై నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకొంటోంది. మంగళవారం సాయంత్రం లొకేషన్ లో ఆ విశేషాలను రామనారాయణ తెలియజేశారు.
'అచై అరువది' అనే తమిళ చిత్రం ద్వారా తాను తొలిసారి 1975లో దర్శకుడిగా పరిచయమయ్యాననీ, శతాధిక చిత్రాలు చేసినప్పటికీ గత పదేళ్లుగా కెరీర్ పరంగా కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాననీ ఆయన చెప్పారు. ట్రెండ్ పరంగా వచ్చిన మార్పులను గమనిస్తూ అందుకు తగ్గట్టుగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే తాను ఈ గ్యాప్ తీసుకున్నానని అన్నారు. 'దుర్గ' చిత్రాన్ని తెలుగులో తీస్తున్నామనీ, తర్వాత తమిళంలో ఉంటుందనీ చెప్పారు. ఓ చిన్నపిల్ల, కారు...ఈ రెండింటి మధ్య పగ-ప్రతీకారం నేపథ్యంలో సినిమా ఉంటుందని చెప్పారు. జీ తెలుగు టీవీ ఛానెల్ లో వచ్చిన 'ఆట' ప్రోగ్రాంలో బాల తార గీతిక అభినయం చూసి ఇందులో ప్రధాన పాత్రకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇంతవరకూ 60 శాతం షూటింగ్ పూర్తయిందనీ, కథకు తగిన లొకేషన్లు, ఇతర వసతులు ఫిలింసిటీలో ఉండటంతో ఇక్కడే షూటింగ్ జరుపుతున్నామని చెప్పారు. కొరియోగ్రాఫర్ శివశంకర్, ఛాయాగ్రాహకుడు సెల్వరాజ్, ప్రధాన పాత్రధారి బేబి గీతిక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాజీవ్ కనకాల, సంగీత, ఆలీ, కల్యాణి, ఎల్బీ శ్రీరాం, ఫఫి, శ్రీధర్ రావు, అమిత్ కుమార్, రియాజ్ ఖాన్, దండపాణి తదితరులు నటిస్తున్నారు. రామనారాయణ కథ, వెలిగొండ శ్రీనివాస్ మాటలు, భువనచంద్ర పాటలు, దేవా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|