225 థియేటర్లలో 'అడవి'
నితిన్, ప్రియాంక కొఠారి జంటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అడవి' చిత్రానికి విడుదలకు ముందే వివపరీతమైన క్రేజ్ ఏర్పడినట్టు చిత్ర సహ నిర్మాత నట్టికుమార్ తెలిపారు. ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 225 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ లో మంగళవారంనాడు ఆ విశేషాలను ఆయన తెలియజేశారు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలవుతోందనీ, నితిన్ తెలుగు హీరో కావడంతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కనిపిస్తోందని చెప్పారు. నితిన్ కు జోడిగా ప్రియాంక కొఠారి గ్లామర్ తో కూడిన పెర్ ఫారమెన్స్ ప్రదర్శించిందని తెలిపారు. ఓ సినిమా షూటింగ్ కోసం అడవికి వెళ్లిన యూనిట్ ఎలాంటి విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొందనేది ఈ చిత్రకథాంశమని చెప్పారు. ఆ యూనిట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండే నితిన్ ఎలాంటి హీరోయిజం ప్రదర్శించాడనేది చాలా క్యూరియాసిటీని కలిగిస్తుందన్నారు.
హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయని తెలిపారు. శ్రీలంకలో ఆమధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో వర్మ ఎంతమాత్రం భీతి లేకుండా షూటింగ్ జరిపి వచ్చారని చెప్పారు. నిర్మాతగా తనకు ఇది తొలి పెద్ద సినిమా అనీ, ఈ సినిమా విడుదలవుతున్న 7వ తేదీ తనకు మరపురాని రోజనీ అన్నారు. వర్మకూ, తనకూ గతంలో కొద్దిపాటి పరిచయమే ఉందనీ, అయితే నిర్మాతలు, పంపిణీదారులైన సుధాకర్ రెడ్డి, సునీల్ నారంగ్, రియాజ్ చొరవతో తనకు ఈ చిత్రం దక్కిందన్నారు. అలాగే చదలవాడ శ్రీనివాసరావు కూడా తనకు మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు చెప్పారు. డబ్బు కోసం తాను ఈ ప్రాజెక్ట్ తీసుకోలేదనీ, వర్మతో మరింత అనుబంధం పెంచుకోవాలనే తనపనతోనే ఈ సినిమా తీసుకున్నాననీ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఏరియాల నుంచి నలుగురైదురుగు బయ్యర్లు ఈ చిత్రం కోసం పోటీపడ్డారనీ, ఈ చిత్రం తర్వాత తనకు నట్టికుమార్ గా కాకుండా, అడవికుమార్ గా పిలిచిననా ఆశ్చర్యపోనవసరం లేదనీ చమత్కరించారు. అంతటి అద్భుత విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు.
Be first to comment on this News / Article!
|