తెలుగుతెరపై 'సర్పయాగం'
తమిళంలో విజయవంతమైన 'ప్రతిన్నాయరు 9 టు 10 ఎ.ఎం.' చిత్రాన్ని తెలుగులో 'సర్పయాగం' పేరుతో అనువదించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కల్యాణి ('మళ్లీ మళ్లీ' ఫేమ్) కథానాయికగా విక్టరీ ఫిలింస్ టి.దుర్గారావు సమర్పణలో రాజపుత్ర క్రియేషన్స్ పతాకంపై రుద్రరాజు ప్రసాద్ రాజు ఈచిత్రాన్ని నిర్మించారు. అన్బు దర్శకుడు. ఈనెలాఖరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు రుద్రరాజు ప్రసాద్ తెలిపారు.
నలుగురు జల్సా పురుషులు ఓ ఆదివారంనాడు మద్యం మత్తులో తమకు తారసపడిన ఓ అమ్మాయిని రేప్ చేస్తారనీ, ఆ అమ్మాయి కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఆ నలుగురిని పెళ్లి చేసుకుని వారిపై ఎలా పగతీర్చుకుందనేది ఈ చిత్ర ఇతివృత్తమనీ తెలిపారు. కల్యాణి చక్కటి నటన ప్రదర్శించిందనీ, అన్భు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ పేర్కొన్నారు. సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డు వరకూ ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలతో ఈ చిత్రం రూపొందిందనీ, తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తమకుందనీ చిత్ర సమర్పకుడు టి.దుర్గారావు తెలిపారు. ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి ఇదే నెలాఖరులో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బాలాజీ, కరుణాస్, కుయిలి, వెన్నెరాడై మూర్తి తదుతరులు నటించారు. ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, వనమాలి పాటలు, సహదేవ్ సినిమాటోగ్రఫీ, ఎస్.కుమార్ ఎడిటింగ్, జాన్ పీటర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|