'మల్లన్న' రాక 15న
'మగధీర' ఫీవర్ తర్వాత అంతా ఎదురుచూస్తున్న విక్రమ్ 'మల్లన్న' (తమిళ కందస్వామి) చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈనెల 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించారు. దాదాపు రెండేళ్ల పాటు ఎంతో శ్రమించి 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని థాను నిర్మించారు. సుశీ గణేషన్ దర్శకత్వం వహించారు. విక్రమ్ కు జోడిగా అందాల నటి శ్రియ నటించింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ చిత్రం గతవారం ఫైనల్ డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకొంది. విక్రమ్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంబరపడ్డారనీ, హాలీవుడ్ తరహాలో అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సుశీ గణేషన్ ను అభినందించారనీ కలైపులి థాను తెలిపారు.
విడుదలకు ముందురోజు ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ను చెన్నైలో ఏర్పాటు చేస్తున్నామనీ, పలువురు బాలీవుడ్ సెలబ్రెటీస్ ను కూడా ప్రిమీయర్ కు ఆహ్వానించామనీ ఆయన చెప్పారు. రెడ్ కార్పెట్ ఎఫైర్ గా ఈ ప్రీమియర్ షో నిర్వహించనున్నామనీ, అన్ని ప్రముఖ ఛానెల్స్ లో లైవ్ ద్వారా ప్రేక్షకులు వీక్షించవచ్చనీ తెలిపారు. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై పోరాటం చేసే ఓ ప్రభుత్వాధికారి కథే ఈ 'మల్లన్న'. సిబిఐలో ఆర్థిక నేరాల విభాగాన్ని పర్యవేక్షించే అధికారిగా విక్రమ్ నటించారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగొచ్చిన విప్లవ భావాలు గల అమ్మాయి సుబ్బలక్ష్మిగా శ్రియ నటించింది. సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. రాబిన్ హుడ్ తరహాలో విక్రమ్ పాత్ర ఉంటుందనీ, అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కిందనీ సుశీ గణేషన్ తెలిపారు. ఇందులో విక్రమ్ 5 గెటప్ లలో కనిపించనున్నారు. విక్రమ్ తొలిసారిగా ఈ చిత్రంలోని అన్నిపాటలకు నేపథ్యగానం అందించడం మరో హైలైట్. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|