మణిశర్మ కొడుకుతో పూరీ చిత్రం
వారసత్వం అనేది సినిమాల్లో సాధారణ విషయమే. ఇటీవల కాలంలో హీరోల వారసులతో పాటు పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల తనయులు కూడా పరిశ్రమలో హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నాగచైతన్య, రాణా, నారా రోహిత్ వంటి పలువురు వారసులు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే కోటి తనయుడు కూడా హీరో అయ్యారు. ఇప్పుడు మరో సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు కూడా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టనున్నారు. మణిశర్మ కుమారుడు సాగర్ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
పరిశ్రమకు వారసులను అందిస్తూ అశ్వనీదత్ గతంలో పలు హిట్ చిత్రాలు అందించారు. మహేష్ ను 'రాజకుమారుడు' తోనూ, రామ్ చరణ్ ను 'చిరుత'తోనూ అశ్వనీదత్ పరిచయం చేశారు. 'చిరుత' చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇదే సెంటిమెంట్ తో మణిశర్మ తన కుమారుడి చిత్రానికి పూరీ-అశ్వనీదత్ కాంబినేషన్ ను ఒప్పించినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడుగా 'ఏక్ నిరంజన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. అనంతరం మణిశర్మ తనయుడి సినిమా ప్రారంభమవుతుంది.
Be first to comment on this News / Article!
|