దిల్ రాజుకు దక్కిన 'మల్లన్న'
ఒకవైపు నిర్మాతగా వరుస సక్సెస్ లు సాధిస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా కూడా బయట బ్యానర్ చిత్రాలను హిట్ల వైపు మళ్లించే పబ్లిసిటీ స్కిల్స్ దిల్ రాజు సొంతం. ఆయనది గోల్డెన్ హ్యాండ్ అనే సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఉంది. ఇటీవల 'హ్యాపీడేస్', 'యువత' వంటి పలు హిట్ చిత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఒకటైన 'మల్లన్న' చిత్రానికి కూడా ఇప్పుడు దిల్ రాజు సెంటిమెంట్ తోడయింది. విక్రమ్, శ్రియ జంటగా వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను సుమారు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో 'మల్లన్న' (తమిళంలో కందస్వామి) చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. సుశీ గణేషన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మాతలు సొంతంగా విడుదల చేస్తుండగా, తెలుగులో 3 ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు సమాచారం.
ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై పోరాడే ఓ ప్రభుత్వాధికారి కథే 'మల్లన్న'. సీబిఐలో ఆర్థిక నేరాల విభాగాన్ని పర్వవేక్షించే అధికారిగా విక్రమ్ కనిపించనున్నారు. చాలా స్టైలిష్ గా, రాబిన్ హుడ్ తరహాలో ఆయన పాత్ర ఉండబోతోంది. ఇందులో ఆడవేషంతో సహా విక్రమ్ ఐదు ప్రత్యేక గెటప్స్ లో కనిపించనున్నారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగివచ్చిన విప్లవభావాలు గల అమ్మాయి సుబ్బలక్ష్మిగా అందాలనటి శ్రియ నటించింది. నటశేఖర కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం రెండు భాషల్లోనూ విక్రమ్ తొలిసారి అన్ని పాటలకు నేపథ్యగానం అందించడం విశేషం. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గీత రచయిత సాహితి ఈ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచమవుతున్నారు. ఏకాంబరం సినిమాటోగ్రఫీ, తోణ తరణి కళాదర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ కానున్నాయి. ఈ చిత్రం ప్రీమియర్ షో చెన్నైలో ఈనెల 20న గ్రాండ్ గా నిర్వహించేందుకు కలైపులి థాను సన్నాహాలు చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|