తేజ 50 సినిమాలు
చిత్రం, జయం, నువ్వు-నేను వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంచలన దర్శకుడు తేజ ఇక నుంచి పూర్తి స్థాయి నిర్మాతగా మరో సంచలనానికి తెరతీయబోతున్నారు. ఇప్పటికే చిత్రం మూవీస్ బ్యానర్ పై పలు చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఆయన 'జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్' అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ పై కార్పొరేట్ స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన వరుస చిత్రాల నిర్మాణం చేపట్టబోతున్నారు. కొత్త బ్యానర్ లో త్వరలోనే 50 చిత్రాలను నిర్మించనున్నట్టు ఆయన ప్రకటించారు.
జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తొలుత 10 చిత్రాలు ప్రారంభించనున్నాననీ, తొలిచిత్రంగా 'అలివేలు మంగ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించనున్నామనీ తేజ చెప్పారు. ఈ చిత్రం 'ప్రతిఘటన', 'అంకుశం' చిత్రాల తరహాలో ఉంటుందనీ, కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తారనీ చెప్పారు. ఇందులో ఇద్దరు టాప్ హీరోయిన్లు నటించనున్నారనీ, ఈ నెలాఖరులోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందనీ తెలిపారు. దీనికి కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తారని చెప్పారు. మరో చిత్రం ఆనంద్ రంగా ('ఓయ్' ఫేమ్) దర్శకత్వంలో ఉంటుందనీ, అలాగే ఈ బ్యానర్ లో ముగ్గురు కొత్త దర్శకులు, ఇద్దరు తమిళ దర్శకులతో ఐదు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఐదేళ్ల వ్యవధిలో 50 చిత్రాల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|