'ఆంజనేయులు' అదరహో!
రవితేజ, నయనతార జంటగా నటించిన 'ఆంజనేయులు' చిత్రం ప్రేక్షకుల చేత అదరహో అనిపించుకుంటుందని నటుడు, చిత్ర నిర్మాత గణేష్ బాబు తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు తొలిసారిగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గణేష్ బాబు శనివారంనాడు మీడియాతో ఆ విశేషాలను పంచుకున్నారు.
నటుడిగా చిత్ర పరిశ్రమలోకి తాను అడుగుపెట్టినప్పటికీ నిర్మాతగా కూడా కావాలనే కోరిక చాలా కాలంగా ఉండేదనీ, అందులో భాగంగానే పవన్ కల్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తొలి సినిమా అనుకున్నప్పుడు వారు అంగీకరించడం తనకు కొండంత ధైర్యం ఇచ్చిందనీ చెప్పారు. అయితే ఇతర కారణాల వల్ల వెంటనే ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని అన్నారు. అదే సమయంలో రవితేజను అడిగితే కథ విని వెంటనే అంగీకరించారనీ, అలా తన సంస్థ నుంచి తొలి సినిమాగా 'ఆంజనేయులు' తెరకెక్కిందనీ చెప్పారు. రవితేజ పూర్తి సహకారంతో విజయవంతంగా తొలి చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. 'యువత'తో తొలి హిట్ ఇచ్చిన పరుశురామ్ ఈ చిత్రాన్ని పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కించారనీ చెప్పారు. థియేటర్లలో 2 నిమిషాలకు నవ్వులు, 5 నిమిషాలకు ఒకసారి చప్పట్లు మారుమోగడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. రవితేజ కెరీర్ లోనే ఈ చిత్ర బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్నారు. రవితేజ-సోనూసూద్ మధ్య వచ్చే సన్నివేశాలు బ్రహ్మాడంగా వచ్చాయన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ఎంతో సహకరించారనీ, నయనతార మరింత అందాలతో ప్రేక్షకులను అలరిస్తుందనీ అన్నారు. ఆడియో ఇప్పటికే పెద్ద సక్సెస్ అయిందనీ, ఈనెల 12 విడుదలవుతున్న ఆంజనేయులు చిత్రం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను తప్పనిసరిగా అలరిస్తుందనీ గణేష్ బాబు తెలిపారు.
Be first to comment on this News / Article!
|