కన్నడ పరిశ్రమలో 'మగధీర' స్వైర విహారం అక్కడి నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం కర్నాటకలో విడుదలైన తొలి రోజు నుంచి మంచి స్పందన రాబట్టుకుంటూ రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా విడుదలైన రోజే బెంగుళూరులో 14 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. సక్సెస్ టాక్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 50 థియేటర్లలో ప్రస్తుతం ఈ చిత్రం ప్రదర్శితమతోంది. ఇది కర్నాటక చిత్ర మండలికి (నిర్మాతల వింగ్) కన్నెర్ర అవుతోంది. ఇతర భాషా చిత్రాల ఒరిజనల్ రిలీజ్ అదే రోజు జరగరాదనే నిబంధనలకు ఇది విరుద్ధమంటూ చిత్ర మండలి కార్యాచరణకు దిగుతోంది.
'మగధీర' మానియా కారణంగా తమ కొత్త చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదనీ, గతంలో రజనీకాంత్ 'శివాజీ' చిత్రం విషయంపై కఠిన చర్యలు తీసుకున్న మండలి ఈసారి 'మగధీర' విషయంలో మిన్నకుందని పలువురు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిర్మాతలు కొన్ని ఏరియాల్లో 'మగధీర' రైట్స్ తీసుకోవడమే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. 'మగధీర' జోరుకు అడ్డుకట్ట వేయకుంటే ధర్నాలు జరపాలని నిర్మాతలు ఆదివారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయం కూడా తీసుకున్నారు. బెంగుళూరులో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాతలు భారీ ధర్నా చేపట్టేందుకు సన్నాహాలు సైతం చేస్తున్నారు.