'అడవి'లో అసభ్యత లేదు
రామ్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'అడవి' చిత్రం సోమవారంనాటికి 4 కోట్ల రూపాయలు వసూలు చేసిందనీ, నితిన్ కెరీర్ లో ఇది గ్రేట్ ఫిల్మ్ గా నిలుస్తుందనీ చిత్ర సహనిర్మాత నట్టికుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ కొన్ని మహిళా సంఘాలు రాద్ధాంతం చేస్తుండటం సబబు కాదని అన్నారు. ఈనెల 7న విడుదలైన 'అడవి' చిత్రం మంచి ఆదరణ చూరగొంటోందని హైద్రాబాద్ లో సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
సినిమా విడుదలైన తొలిరోజు 1.60 లక్షలు, రెండో రోజు 1.22, మూడోరోజు 1.62 లక్షలు వసూలు చేసిందనీ, 'మగధీర' చిత్రం సంచలనం సృష్టిస్తున్న సమయంలో తమ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం ఆనందంగా ఉందనీ ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని 205 సెంటర్లలో విడుదల చేయడం రికార్డని, వైజాగ్ లో 7 థియేటర్లు, విజయవాడలో 5, గుంటూరులో 2, ఈస్ట్ అండ్ వెస్ట్ లు, ఇతర ప్రాంతాల్లో రెండేసి థియేటర్లలో విడుదల చేస్తే అద్భుతమైన ఓపినింగ్స్ వచ్చాయన్నారు. ఈ క్రెడిట్ అంతా రామ్ గోపాల్ వర్మకే దక్కుతుందన్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ గొడవలు చేయడం, హైద్రాబాద్ లోని సంథ్య థియేటర్ లో పోస్టర్లు చింపేయడం వంటి చర్యలు ఆక్షేపణీయమని అన్నారు. యు/ఏ సెన్సార్ పొందిన ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలనడం వారి అపోహలకు అద్ధం పడుతుందన్నారు. 'మగధీర', 'బిల్లా' వంటి చిత్రాల్లో లేని అసభ్యత ఈ చిత్రంలో ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు. ఇదంతా కావాలని ఇండస్ట్రీలో ఓ వ్యక్తి చేయిస్తున్నట్టు తెలిసిందనీ, త్వరలోనే ఆయన పేరు బయట పెడతాననీ స్పష్టం చేశారు. మహిళా నాయకురాలు ఝాన్సీ సినిమా చూడకుండా గొడవ చేయడం దురదృష్టకరమనీ, అభ్యంతరాలు ఎవరికి ఉన్నా వారికి బహిరంగంగా 'అడవి' సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాననీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|