'మగధీర'కు రజనీ ప్రశంస
బాక్సాఫీస్ రికార్డుల దిశగా దూసుకుపోతున్న 'మగధీర' చిత్రానికి, రామ్ చరణ్ నటనకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. రజనీకాంత్ కోసం చెన్నైలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను చిరంజీవి ఏర్పాటు చేశారు. ఫోర్ ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్ లో రజనీకాంత్ ఈ చిత్రాన్ని తిలకించారు. అనంతరం రామ్ చరణ్ ను ప్రత్యేకంగా అభినందించారు.రజనీతో 'రోబో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్ సైతం ఎవిఎం ప్రివ్యూ థియేటర్ లో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల జల్లు కురిపించారు.
రజనీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రామ్ చరణ్ తొలి చిత్రమైన 'చిరుత' స్పెషల్ ప్రివ్యూను కూడా అప్పట్లో తాను తిలకించాననీ, పెద్ద స్టార్ కావడానికి అవసరమైన ప్రతిభా పాటవాలు అతనిలో ఉన్నాయని ఆ రోజే తాను జోస్యం చెప్పాననీ అన్నారు. తాను చెప్పిన మాటలు నిజమై 'మగధీర' ఇప్పుడు అద్భుతమైన రికార్డులు సాధిస్తుండటం తనకెంతో సంతోషంగా ఉందనీ చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో కన్నులపండువ చేసిన చిత్రమిదనీ, రామ్ చరణ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందనీ శంకర్ ప్రశంసించారు.
Be first to comment on this News / Article!
|