అల్లు శిరీష్ మ్యాగజైన్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఫిల్మ్ మ్యాగజైన్ ప్రారంభించనున్నారంటూ కొద్దికాలంగా వినిపిస్తున్నా ఇది ఇంతవరకూ కార్యరూపంలోకి రాలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తీసుకోబోతున్నారు. అల్లు అర్జున్ సోదరుడైన అల్లు శిరీష్ కొద్దికాలంగా గీతా ఆర్ట్స్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా పబ్లిసిటీ, బిజినెస్ పరమైన వ్యవహారాలు చూసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిందీలో అమీర్ ఖాన్ కథానాయకుడుగా విజయవంతమైన 'గజనీ' చిత్రానికి మార్కెటింగ్ క్యాంపైన్ నిర్వహించిన అల్లు శిరీష్ అంతకుముందు ఇదే బ్యానర్ లో పవన్ కథానాయకుడుగా నటించిన 'జల్సా' చిత్రానికి మార్కెటింగ్ ఆపరేషన్స్ చేశారు. ఇటీవలే విడుదలైన రామ్ చరణ్ 'మగధీర' చిత్రానికి మార్కెటింగ్, పబ్లిసిటీ వ్యవహారాలు స్వయంగా చూసుకున్నారు. అల్లు శిరీష్ ప్రతిభాపాటవాల పట్ల మంచి నమ్మకం ఉన్న అల్లు అరవింద్ ఇప్పుడు సినిమా మ్యాగజైన్ బాధ్యతలను అతనికి అప్పగించారని తెలుస్తోంది.
దక్షిణాది సినిమా తాజా విశేషాలను ఎప్పటికప్పుడు ఈ మ్యాగజైన్ ప్రచురిస్తుంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చురుకుగా జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినీ మ్యాగజైన్ల మార్కెట్ పెద్ద ఆశావహంగా లేదనీ, ఈ తరుణంలో అల్లు శిరీష్ కొత్త ఐడియాస్ తో మ్యాగజైన్ ప్లాన్ చేయాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈమధ్యనే నటి భూమిక సైతం 'మాయాబజార్' అనే మ్యాగజైన్ ను ప్రారంభించారు.
Be first to comment on this News / Article!
|