ఆర్ట్ సినిమాలో నయనతార
ఇమేజ్ వేరు...కళాతృష్ణ వేరు. నాలుగు కాలాల పాటు వేషాలు కావాలంటే గ్లామర్ పాత్రలే దగ్గర మార్గం. అలాగని వాటికే పరిమితమైతే ఆర్టిస్టులోని కళాతృష్ణ తీరే అవకాశాలుండవు. అందుకే వెండితెరపై అందాలు ఆరబోసే హీరోయిన్లు కూడా అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే అటువైపు జంప్ చేయడానికి వెనుకాడరు. సహజంగా ఆర్ట్ సినిమాల్లో నటనకి స్కోప్ ఎక్కువ. అయితే ఆ తరహా సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశమే అందాల తార నయనతారను తాజాగా వరించింది. అది కూడా ఆమె మాతృభాష అయిన మలయాళంలో కావడం విశేషం.
తమిళ 'బిల్లా'లో బికినీ అందాలతో కనువిందు చేసిన నయనతార ఇప్పుడు ఆ భాషలో ఓ రెండు, తెలుగులో ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న 'అదుర్స్' చిత్రాల్లో నటిస్తోంది. వీటి తదుపరి చిత్రంగా మలయాళంలో తెరకెక్కనున్న 'ఎలక్ట్రా' అనే చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఓ గ్రీకు నవల ఆధారంగా మలయాళ దర్శకుడు శ్యామ్ ప్రసాద్ ఈ చిత్ర కథను తయారు చేసుకున్నారు. వింద్యన్ నిర్మాత. నయనతార సరసన హీరోగా ఆర్యతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. నయనతార పాత్ర చుట్టూనే ఈ కథ ఉంటుందనీ, ఇందులో 'అలగ్జాండ్రా' పాత్రను పోషించనున్నారని చెబుతున్నారు. ప్రస్తుంత చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని నవంబర్ నుంచి 'ఎలక్ట్రా' చిత్రం షూటింగ్ లో నయన తార పాల్గొంటుందని తెలుస్తోంది. 'పరుత్తి వీరన్'లో డీ-గ్లామరైజ్డ్ పాత్ర ద్వారా జాతీయ అవార్డును ఎగరేసుకుపోయిన ప్రియమణి తరహాలోనే నయనతార కూడా ఈసారి అవార్డు దక్కించుకుంటుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|