నేనేంటి..బికినీ ఏంటి?
'ఇదిగో తోక అంటే...అదిగో పులి అంటారు. 'గోవా' పేరున్న సినిమాలో నటిస్తున్నంత మాత్రాన గోవా బీచ్ లో కనిపించే బికినీ అమ్మాయిల గాటన నన్ను కూడా కట్టేయడం ఏమిటి? ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్లు చేసుకుంటూ పోవడం ఏం బాగోలేదు. నాకిలాంటివి నచ్చవు' అంటూ నటి స్నేహ రుసరుసలాడుతోంది. స్నేహ అంటే తెలియని వారు ఉండరు కదా. సంప్రదాయ పద్ధతిలో అచ్చం మన తెలుగుమ్మాయిని తలపిస్తుంటుంది. సౌందర్య తర్వాత ఆమె స్థానాన్ని స్నేహ భర్తీ చేస్తూ వచ్చింది. 'రాధా గోపాళం', 'శ్రీరామదాసు' వంటి పలు చిత్రాలు స్నేహ హోమ్లీ గాళ్ ఇమేజ్ ను నిలబెట్టాయి. గ్లామర్ హీరోయిన్ల రేసులో ఇటీవల స్నేహకు అవకాశాలు తగ్గినా ఈ పరిస్థితి తాత్కాలికమేనని స్నేహ గట్టి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న'భవానీ ఐపిఎస్' చిత్రంపైనే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం తర్వాత తనకు యాక్షన్ హీరోయిన్ ఇమేజ్ కూడా వస్తుందనే ధీమాతో ఉంది. ఈ చిత్రంలో స్నేహ మోడరేట్ గా కూడా కనిపిస్తుండటంతో గాసిప్ మాంగర్స్ కొత్త ప్రచారం మొదలుపెట్టేశారు. బికినీలో స్నేహ నటించబోతోంది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ వదంతులపైనే స్నేహ ఇప్పుడు మండిపడుతోంది.
'గోవా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి నేను బికీనీలో నటించనున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. వేషాల కోసం బికినీ వేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇందులో నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాను. వేషాల కోసం వెంపర్లాడాల్సి అవసరం నాకు లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు కూడా ఉన్నాయి. వేషాల కోసం శరీరాన్ని బహిర్గతం చేసే బికినీలు ఎప్పటికీ ధరించే ప్రసక్తే లేదు' అంటూ స్నేహ తేల్చిచెప్పింది. మొత్తానికి బికినీ బేబీల ప్రవాహంలో కొట్టుకుపోకుండా స్నేహ తీసుకున్న నిర్ణయం ఆమెకున్న ట్రెడిషనల్ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తుంది.
Be first to comment on this News / Article!
|