గోపిచంద్-అనుష్క మూడోసారి
గోపీచంద్ నిలకడైన హిట్లతో యాక్షన్ హీరోగా తన సత్తా చాటుకుంటున్నారు. 'యజ్ఞం', 'రణం' 'లక్ష్యం', 'శౌర్యం' వంటి హిట్లు గోపీచంద్ ఖాతాలో ఉన్నాయి. వీటిలో 'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాల్లో గోపీచంద్ కు అనుష్క జోడిగా నటించింది. ఈ ఇద్దరూ హిట్ పెయిర్ గా గుర్తింపు పొందారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ పై రవితేజ హీరోగా వచ్చిన 'కిక్' మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సంస్థ గోపీచంద్, అనుష్క జంటతో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి కె.అచ్చిరెడ్డి సమర్పకుడుగా వ్యవహరించనున్నారు.
ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తారనీ, ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని అచ్చిరెడ్డి తెలిపారు. 'కిక్ ' సక్సెస్ తర్వాత తమ సంస్థ నుంచి వచ్చే తదుపరి చిత్రంలో ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉంటాయనీ, వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనీ ఆయన తెలిపారు. గోపీచంద్ నట జీవితంలోనే ఇది విభిన్న చిత్రం అవుతుందని ఆయన తెలిపారు. విజయదశమి పర్వదినాన ఈ చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం గోపీచంద్ తొలిసారి త్రిషతో కలిసి నటిస్తున్న 'శంఖం' విడుదలకు సిద్ధమవుతుండగా, అనుష్క సైతం మహేష్ క్రేజీ ఫిల్మ్ 'వరుడు'లోనూ, క్రిష్ 'వేదం' లోనూ నటిస్తోంది.
Be first to comment on this News / Article!
|