'అడవి' టీమ్ పై క్రిమినల్ కేసు
రామ్ గోపాల్ వర్మ సినిమాలు విడుదలకు ముందు సంచలనం సృష్టించి విడుదలైన తర్వాత చతికిలపడతాయనే అపప్రద ఇటీవల కాలంలో ఎక్కువైంది. వర్మ స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'అడవి' చిత్రం విడుదలకు ముందు పబ్లిసిటీ పోస్టర్లలో నటి ప్రియాంక కొఠారీని బికినీ అందాలతో కనిపించడం కలకలం రేపింది. ఆ పోస్టర్ల లో కనిపించిన బికినీ సీన్లు కొన్ని ఇటీవలే విడుదలైన సినిమాలో కనిపించలేదు కూడా. అయినప్పటికీ థియేటర్ల వద్ద పోస్టర్ల కలకలం చెలరేగి సినిమాలోని అశ్లీల సంఘటనలపై కొన్ని సంఘాలు సంధ్య థియేటర్ వద్ద తీవ్ర నిరసన తెలిపాయి. వినైల్స్ ను తగులబెట్టారు. తాజాగా ప్రియాంక కొఠారి సినిమాలో హద్దుల మీరిన శృంగారం ప్రదర్శించిందనీ, పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రాజేష్ పుత్రా క్రిమిషల్ కేసు వేశారు. ప్రియాంక తో పాటు వర్మ, నితిన్ లపై కూడా కేసు వేశారు.
మరోవైపు 'అడవి' సహనిర్మాతగా వ్యవహరించిన నిర్మాత నట్టికుమార్ ఇదంతా గిట్టనివారు సృష్టిస్తున్న గందరగోళంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై పరిశ్రమకు చెందిన ఒకరు కావాలని వివాదం రేపుతున్నారనీ, ఆయన పేరు త్వరలోనే బయట పెడతాననీ అంటున్నారు. వారం రోజుల తేడాలో విడుదలైన 'మగధీర', 'అడవి' చిత్రాలు రకరకాల కారణాలతో వివాదాల్లో కూరుకుపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనే విషయం ఎలాగున్నా బోలెడంత ఉచిత పబ్లిసిటీ లభిస్తోందంటూ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.
Be first to comment on this News / Article!
|