'లక్కీ..' రాజేంద్రప్రసాద్
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హాస్యం ఇప్పటికీ నిత్యనూతనం. ఇటీవల కాలంలో అభినయానికి ప్రాధాన్యం ఉన్న 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలతో పాటు పూర్తి కామెడీ 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' చిత్రంలోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం హాలీవుడ్ వెంచర్ 'క్విక్ గన్ మురుగన్'లో నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్ తెలుగులో మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ తో పాటు శివాజీ మరో కథానాయకుడుగా నటించనున్నారు. లక్కీ మీడియో పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
'టాటా బిర్లా మధ్యలో లైలా', 'సత్యభామ', 'మా ఆయన చంటిపిల్లాడు' చిత్రాలను నిర్మించిన బెక్కం వేణుగోపాల్ (గోపి) ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీకాంత్ కథానాయకుడుగా విడుదలకు సిద్ధంగా ఉన్న 'అఆఇఈ' చిత్రానికి కథను అందించిన గోళ్లపాటి నాగేశ్వరరావు ఈ తాజా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే రాజేంద్రప్రసాద్, శివాజీ కలిసి గతంలో 'సందడే సందడి', 'శ్రీరామచంద్రులు' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రాన్ని సోషియో ఫాంటసీ కథాంశంతో దర్శకుడు తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోందనీ, ఈ నెలాఖరులోనే షూటింగ్ ప్రారంభమవుతుందనీ దర్శకనిర్మాతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|