ఐదారేళ్ల క్రితం వరకూ తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించిన రంభ కొద్దికాలంగా బాగా వెనుకబడినప్పటికీ ఇటీవల మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి కుర్రహీరోలతో ఐటెం సాంగ్స్ లోనూ నటించి తన స్పీడ్ తగ్గలేదని నిరూపించుకుంది. రంభ కథానాయికగా వ్యాస్ దర్శకత్వంలో ఆయన సోదరుడు పల్లివి శ్రీనివాస్ నిర్మిస్తున్న 'ప్రతిక్షణం' చిత్రం నిర్మాణంలో ఉంది. దీనికితోడు నవ్వుల రేడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా ఆంగ్లంలో రూపొందుతున్న 'క్విక్ గన్ మురుగన్'లోనూ రంభ తన గ్లామర్ అప్పీల్ తో ప్రేక్షకులను అలరించబోతోంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఫ్యాట్ షిప్ పిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ముంబైలోని బాంద్రా-ఓర్లా సీలింక్ వంతెనపై రాజేంద్రప్రసాద్ గుర్రంపై స్వారీ చేసే ఘట్టాన్ని కూడా ఇటీవల రిచ్ గా చిత్రీకరించారు. నిబంధనల ప్రకారం జంతువులను సీలింక్ వంతెనపై అనుమతించకపోవడంతో టెంపోలో గుర్రంమీద రాజేంద్రప్రసాద్ కళ్లాలు పట్టుకోగా ఆ సన్నివేశాలు లాగించేశారట. ఈ చిత్రం ఇప్పుడు మరింత కాస్ట్ లీ ఆఫైర్ కూడా అయిందట. ఇందులో ఓ గ్యాంగ్ స్టర్ తో సహచర్యం చేసే 'మాంగో డాలీ' పాత్రలో రంభ నటిస్తోంది. పాత్రపరంగా రంభ సరికొత్త లుక్ లో కనిపించాల్సి ఉండటంతో రంభకు ఓ విగ్ కూడా తొడిగారు. ఇందులో ఆశ్చర్యం లేదు కానీ..ఆ విగ్ ఖరీదు అక్షరాలా 15 లక్షలట.
రంభ సరికొత్త లుక్ కు అవసరమైన విగ్ ఇండియాలో ఎక్కడా దొరక్క పోవడంతో నిర్మాతలు అమెరికా నుంచి విగ్ ను తెప్పించారు. ఖరీదు ఎక్కువే అయినా ఆ విగ్ లో రంభ అందాలు ద్విగుణీకృతమయ్యాయని నిర్మాతలు సంబరపడుతున్నారు. మొత్తానికి ఆ విగ్ లో అచ్చం బార్బీ డాల్ ను రంభ తలపిస్తోంది.