'మల్లిక నిన్ను ప్రేమిస్తున్నాను'
అజిత్, నవదీప్, నయతార ప్రధాన పాత్రధారులుగా రాజు సుందరం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని 'మల్లిక నిన్ను ప్రేమిస్తున్నాను' అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. వి.ఎం.స్వర్ణలత సమర్పణలో రావిచర్ల మురళీకృష్ణ నిర్మాతగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కె.ఎస్.రామారావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సాయిబాబకు అందజేశారు. బోస్, విఎంజి కృష్ణ, రాంప్రసాద్, రావిచర్ల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫరైన రాజు సుందరం తొలిసారి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో సంగీత, నృత్యపరంగా కూడా సినిమా చాలా బాగుంటుందని తాను అనుకుంటున్నానని కె.ఎస్.రామారావు పేర్కొన్నారు. నవదీప్, నయనతార సైతం తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగోవడం కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందన్నారు. సరైన సమయంలో రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని సూచించారు. నిర్మాత రావిచర్ల మురళీకృష్ణ మాట్లాడుతూ, తాము గతంలో తమిళ 'డ్యూయెట్' చిత్రాన్ని తెలుగులోకి, తెలుగులో వచ్చిన 'పౌర్ణమి', 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రాలు మలయాళంలోకి అనువదించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో రాజుసుందరం అందించిన డాన్స్ లు, ఫైట్స్, యువన్ శంకర్ రాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయన్నారు. అలాగే నవదీప్ పూర్తి స్థాయి పాత్ర పోషించారనీ, సుమన్ విలన్ గా, నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా నాజర్ నటించారని చెప్పారు. సెప్టెంబర్ మొదటివారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

Be first to comment on this News / Article!
|