'మగధీర' డిస్ట్రిబ్యూటర్ పై వేటు
రామ్ చరణ్ కథానాయకుడుగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం డిస్ట్రిబ్యూటర్ విజయ్ కుమార్ ను కర్నాటక ఫిల్మ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్ సిసి) సస్పెండ్ చేసింది. కన్నడేతర చిత్రాలకు అనుమతించిన థియేటర్ల కంటే ఎక్కువ థియేటర్లలో 'మగధీర' చిత్రాన్ని విడుల చేయడం ద్వారా ఛాంబర్ నిబంధనలను అతిక్రమించినందుకే ఆయనపై వేటు పడినట్టు కెఎఫ్ సిసి ప్రెసిడెంట్ డాక్టర్ జయమాల తెలిపారు.
'మగధీర' చిత్రాన్ని లెక్కకు మించిన థియేటర్లలో విడుదల చేయడం వల్ల తమ కొత్త సినిమాలకు థియేటర్లు దొరకలేదనీ, ఇది ఛాంబర్ నిబంధలనకు విరుద్ధమనీ కన్నడ సినీ నిర్మాతల సంఘానికి చెందిన సుమారు 30 మంది నిర్మాతలు గత మంగళవారంనాడు కెఎఫ్ సిసి కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు తెలియజేశారు. కన్నడేతర చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు కర్నాటకలో ఎక్కువ స్క్రీనింగ్ ల ద్వారా భారీ బడ్జెట్ చిత్రాల బిజినెస్ ను ఇబ్బడిముబ్బడిగా పెంచుకునే చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. కెఎఫ్ సిసి నిబంధనల ప్రకారం కన్నడేతర సినిమాలను బెంగుళూరులో 14 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మూడు మల్టీప్లెక్స్ లలో మాత్రమే రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదికూడా ఒరిజనల్ వెర్షన్ రిలీజైన ఏడు వారాల తర్వాత మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో రిలీజైన సమయంలోనే 'మగధీర' చిత్రాన్ని 51 థియేటర్లలో విడుదల చేయడం పూర్తిగా ఛాంబర్ నిబంధనలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా 'మగధీర' పంపిణీ హక్కులను 1.5 కోట్లకు దక్కించుకున్న విజయ్ కుమార్ తొలివారంలోనే 4 కో్ట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|