'యంగ్ ఇండియా' పిలుస్తోంది
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు చాలాకాలం తర్వాత మళ్లీ దర్శకపగ్గాలు చేపడుతున్నారు. ఇంతవరకూ 148 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి 200కు పైగా చిత్రాలకు కథలు-సంభాషణలు అందించారు. 40 మందికి పైగా కొత్త దర్శకులను పరిచయం చేశారు. మోహన్ బాబు, ఈశ్వరరావు వంటి ఎందరెందరో నటులను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ కూడా ఆయనదే. కొద్దికాలం క్రితం వరకూ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చిత్ర నిర్మాణం మాత్రమే సాగిస్తూ వచ్చిన దాసరి ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు మళ్లారు. ఇటీవలే 'మేస్త్రి' చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. తాజాగా ఆయన 'యంగ్ ఇండియా' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇది ఆయనకు దర్శకుడిగా 149వ చిత్రం కానుంది. దీనికి నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించనున్నారు. అంతా కొత్త నటీనటులతో రూపొందనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లతో సహా 48 మంది తారాగణం ఉంటారు. ఈ చిత్రంలో నటిచేందుకు ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సిరిమీడియో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.
నటన పట్ల ఉత్సాహంతో పాటు కొద్దో గొప్పో టాలెంట్ ఉన్న వారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, చిరునామా, ఇతర వివరాలతో పాటు ఫుల్ సైజ్, క్లోజ్, ప్రొఫైల్ తో సహా మొత్తం ఆరు ఫోటోలు ఈనెల 24వ తేదీ లోగా పంపించాలి. ఆయా పాత్రలకు సరిపోతారని భావించిన వారిని పిలిపించి స్క్రీన్ టెస్ట్ జరుపుతారు. ఇందుకు అయ్యే దారి ఖర్చులు, వసతులను సంస్థ భరిస్తుంది. ఎంపికైన కళాకారులకు నెలరోజుల పాటు సంస్థ ఖర్చులతోనే శిక్షణ ఇస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులు లేదా గార్డియన్ అనుమతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సిరిమీడియా ప్రైవేట్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ 15, జూబ్లీ హిల్స్, హైద్రాబాద్ 33కి దరఖాస్తు చేసుకుని ఔత్సాహిక కళాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|