'మావీరన్'గా మగధీర
రామ్ చరణ్ తేజ 'మగధీర' ఇప్పుడు రజనీకాంత్ టైటిల్ తో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దరకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరలో తమిళంలోకి అనువదించేందుకు అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వెర్షన్ కు 'మావీరన్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా రాజశేఖర్ దర్శకత్వంలో 1986లో 'మావీరన్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో రామ్ చరణ్ తమిళ ప్రేక్షకులను అలరించబోతుండం విశేషం.
'మగధీర' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని అల్లు అరవింద్ చెప్పినప్పటికీ తాజాగా కొన్ని కీలక సన్నివేశాలను రీమేక్ చేసి మిగతా పార్ట్ ను యథాతథంగా ఉంచాలనీ, ముఖ్యంగా తమిళ ఫ్లేవర్ కోసం ఈ మార్పులు అనివార్యమనీ ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా షేర్ ఖాన్ గా శ్రీహరి నటించిన పాత్రను ఓ ప్రముఖ తమిళ నటుడితో రీషూట్ చేయబోతున్నారు. ఈ పాత్రకు యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే వడివేలుతో ఒక కామెడీ ట్రాక్ ను కూడా తీయాలనుకుంటున్నారు. రజనీకాంత్ ఇటీవలే చెన్నైలో 'మగధీర' స్పెషల్ షో చూడటం, రామ్ చరణ్ నటన, సినిమా తెరకెక్కించిన తీరును ప్రశంసించడటంతో సహజంగానే తమిళ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పుడు రజనీ కాంత్ టైటిల్ కూడా వచ్చి చేరడంతో చరణ్ 'మావీరన్'కు తిరుగుండకపోవచ్చు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|