'పుత్రుడు' ఆడియో రిలీజ్
ఇంద్రసేన, తనీషా, అరుణ్, బిందు, శ్రీఅంజలి ప్రధాన తారాగణంగా ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ నిర్మిస్తున్న చిత్రం 'పుత్రుడు' (ఆరుద్ర నక్షత్రం). శ్రావణ్ బాపట్ల దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆడియో సీడీని ఆవిష్కరించి నటుడు శివారెడ్డికి తొలి కాపీని అందజేశారు. ఆడియో క్యాసెట్ ను నటుడు చిన్నా ఆవిష్కరించి సీనియర్ నటి కవితకు అందజేశారు. యాపిల్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, చిన్న సినిమాలు సంఖ్యాపరంగా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయనీ, వీటివల్ల పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందనీ అన్నారు. చిన్న సినిమాలు ఎంత బాగా ఆడితే అంతగా పరిశ్రమ కళకళలాడుతుందన్నారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నా మాట్లాడుతూ, చిన్న సినిమా తీయడం కష్టం కాకున్నా విడుదల సందర్భంలో ఎన్నో చిక్కులు వస్తున్నాయని అన్నారు. మనకు రావాల్సిన లాభాలనే కాకుండా చివరకు పెట్టుబడిని సైతం వేరేవాళ్లు ఎంజాయ్ చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందనీ, తన అభిమాన గాయకుడైన ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించిన పాటలో నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందనీ చెప్పారు. ఈ చిత్రంలో కథానాయకుడు మెడికోగా, అఘోరాగా రెండు కోణాలున్న పాత్రను పోషించినట్టు దర్శకుడు శ్రావణ్ బాపట్ల తెలిపారు. హీరోకి మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉండటం వల్ల అద్భుతంగా నటించాడని చెప్పారు. పరుశువేది నేపథ్యంలో సాగే సినిమా ఇదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సత్య, హీరోయిన్లు తనీషా, బిందు, నటుడు రాజేంద్ర, గణేష్ గుప్తా, వేణుగోపాల్, విద్య తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|