లయ, అర్చన వంటి పదహారణాల తెలుగమ్మాయిల తర్వాత బిందు మాధవి సైతం టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుటోంది. శేఖర్ కమ్ముల నిర్మాతగా రూపొందించిన 'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో బిందు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం బాక్సాఫీస్ ఫలితం నిరాశపరచినా బిందుకు ఇప్పుడు మంచి అవకాశాలే వరిస్తున్నాయి. రాశి కంటే వాసి ముఖ్యమని భావిస్తున్న బిందు ఆచితూచి మాత్రమే సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పూరీ సోదరుడు సాయిరాం శంకర్ ఇందులో కథానాయకుడు. రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గాయకుడు రఘు కుంచె తొలిసారి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బిందు మాధవికి మరో మంచి ఆఫర్ దక్కింది. దిల్ రాజు నిర్మాతగా శ్రీవాస్ ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో బిందు మాధవి ఓ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రంలో రామ్ కథానాయకుడు.
యువతరం హీరోల్లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న రామ్ తో పాటు ఈ చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియా ఆనంద్ (శేఖర్ కమ్ముల 'లీడర్' ఫేమ్) హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా ఇప్పుడు బిందు కూడా వచ్చిచేరింది. బ్యానర్ వాల్యూ ఉన్న చిత్రాలు వరుసగా బిందు మాధవిని వరిస్తుండటంతో నటిగా ఆమె కెరీర్ ఊపందుకున్నట్టే. సంక్రాతి కానుకగా 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.