'మల్లన్న' గ్రాండ్ రిలీజ్
చియాన్ విక్రమ్ సూపర్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'మల్లన్న' కోసం ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ద్విభాషా చిత్రంగా (తమిళంలో కందస్వామి) 45 కోట్ల భారీ బడ్జెట్ తో సుమారు రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 21న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రాన్ని భారీ సాంకేతిక విలువలతో దర్శకుడు సుశీ గణేషన్ తెరకెక్కించారు. దక్షిణాదిలోనే అత్యంత భారీ వ్యయంతో, ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా భారీ స్క్రీనింగ్స్ తో విడుదలవుతున్న చిత్రమిదని కలైపులి ధాను చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా 900కు పైగా స్క్రీనింగ్స్ తో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 'మల్లన్న' చిత్రానికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని హైద్రాబాద్-సికింద్రాబాద్ లో 49 థియేటర్లలోనూ, నైజాం ఏరియాలో మరో 52 థియేటర్లలోనూ దిల్ రాజు విడుదల చేస్తున్నారు. 'మల్లన్న' నైజాం ఏరియా రైట్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.
రామ్ చరణ్ 'మగధీర' చిత్రం మూడోవారంలోకి అడుగుపెట్టి మంచి కలెక్షన్ల సాధిస్తున్న తరుణంలో 'మల్లన్న' వస్తుండటం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. 'అపరిచితుడు' తర్వాత విక్రమ్ కు మళ్లీ ఆ స్థాయి చిత్రం అవుతుందనే భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఒక స్ట్రయిట్ హీరో స్థాయిలో 'మల్లన్న' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. థియేటర్ల పరంగా కూడా విక్రమ్ కు ఇది సరికొత్త రికార్డు అవుతోంది. విక్రమ్ సరసన అందాల నటి శ్రియ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|