'శంఖం' ఆడియో రిలీజ్
గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శంఖం'. ఈ చిత్రం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. బుధవారం రాత్రి తాజ్ బంజారాలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. వి.వి.వినాయక్ ఆడియో క్యాసెట్ ను విడుదల చేసి తొలి ప్రతిని సి.కల్యాణ్ కు అందజేశారు. ప్రభాస్ ఆడియో సీడీని విడుదల చేసి బి.గోపాల్ కు అందజేశారు. చిత్రయూనిట్ తో పాటు వి.ఎన్.ఆదిత్య, కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, పోకూరి బాబూరావు, భోగవల్లి ప్రసాద్, ఎం.ఎల్.కుమార్ చౌదరి, జయనన్ విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాతలు మంచి క్రమశిక్షణ ఉన్నవారనీ, గోపీచందర్ లో మంచి ఎనర్జీ ఉందనీ ఉన్నారు. సినిమా క్లిప్పింగ్ చూశాననీ, చాలా బాగున్నాయనీ, సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ, శివ మంచి టెక్నీషియన్ అనీ, ట్రైలర్స్ చూస్తుండే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అనిపించేలా ఉందనీ చెప్పారు. అలాగే ఒక గొప్ప దర్శకుడి కుమారుడిగా గోపీచంద్ అంటే దర్శకులందరికీ చాలా ఇష్టమనీ చెప్పారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. 'శౌర్యం'లో ఒక సున్న ఉన్నందున వంద రోజులు ఆడిందనీ, 'శంఖం'లో రెండు సున్నాలు ఉన్నందున రెండు వందల రోజులు ఆడుతుందని వి.ఎన్.ఆదిత్య అన్నారు. గతంలో తాను దర్శకత్వ శాఖలో పని చేస్తుండగా ఈ చిత్ర నిర్మాతలు తనతో పనిచేశారనీ, వారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ సి.కల్యాణ్ పేర్కొన్నారు. టైటిల్ లో మంచి ఫోర్స్ ఉందని, సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని పోకూరి బాబూరావు అన్నారు. సినిమా టైటిల్ చాలా బాగుందనీ, స్వర్గీయ టి.కృష్ణ తనకు సీనియర్ కాలేజ్ మేట్ అనీ, ఆయన కుమారుడైన గోపీచంద్ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ బి.గోపాల్ పేర్కొన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ, శివ దర్శకత్వంలో తనకు ఇది రెండో చిత్రమనీ, కథ నచ్చే సినిమా ఒప్పుకున్నాననీ అన్నారు. సినిమా ప్రారంభించినప్పుడు బడ్జెట్ విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టాననీ, అందుకు తగ్గట్టే నిర్మాతలు ఎక్కడా రాజీ లేకుండా చక్కటి క్వాలిటీతో సినిమా తీశారనీ చెప్పారు. ఇందులో ఏడు పాటలు ఉన్నాయనీ, తమన్ ఎస్ మంచి సంగీతాన్ని అందించారనీ చెప్పారు. ఈ చిత్రం మంచి విజయ సాధించి నిర్మాతలకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. నటులు ఎల్బీ శ్రీరామ్, కోట శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
Be first to comment on this News / Article!
|